గల్లీ To ఐఢీఎల్‌

గల్లీ To ఐఢీఎల్‌





సందీప్‌..లక్కీడిప్‌


రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌


ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ జట్టుకు వైస్‌ కెప్టెన్‌  


పంజాబ్‌లో రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సందీప్‌  


ఫలించిన చిరకాల స్వప్నం


దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభ


కలిసొచ్చిన ముస్తాక్‌ అలీ టోర్నీ


లీగ్‌ దశలో సిక్సర్ల వర్షం.. పరుగుల ప్రవాహం


తండ్రి చిరుద్యోగి..


లీగ్‌ క్రికెటర్‌.. హెచ్‌సీఏ అంపైర్‌


కొడుకు కోసం బీడీఎల్‌ సర్వీస్‌ త్యాగం


ఆపై పుత్రుడి క్రికెట్‌ భవిష్యత్‌పైనే దృష్టి


తొలి కోచ్‌ తండ్రే.. ఆపై జాన్‌ మనోజ్‌ వద్ద శిక్షణ


రాంనగర్‌ వైఎస్సార్‌ పార్కు సమీపంలో సంబరాలు








గల్లీ చిన్నోడు బావనక సందీప్‌ దశ తిరగనుంది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునే అద్భుత అవకాశం మనోడికి దక్కింది.  దేశవాళీ టోర్నీల్లో మెరిపించిన ఈ భాగ్యనగరం కుర్రోడిపై గురువారం కనక వర్షం కురిసింది.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ సందీప్‌ను సొంతం చేసుకుంది.  వీవీఎస్‌ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్‌ లాంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్రోత్సాహంతో సందీప్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌ మరింత ఉజ్వలంగా మారనుంది. బేస్‌ ప్రైజ్‌కే (ప్రాథమిక ధర) 'సన్‌' చెంత చేరిన ఈ హైదరాబాదీ సొంత ప్రేక్షకుల మద్దతుతో ఐపీఎల్‌లోచెలరేగాలని ఉత్సాహంగాఎదురుచూస్తున్నాడు.



 







ముషీరాబాద్‌: తండ్రి త్యాగానికి ఆ కుర్రాడు న్యాయం చేశాడు. రాంనగర్‌ గల్లీల్లో బ్యాట్‌ పట్టుకు తిరిగిన 'బావనక సందీప్‌' ఐపీఎల్‌కు ఎంపికై మధ్య తరగతి కుటుంబం నుంచి మరో కలికితురాయిగా నిలిచాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో జరిగిన వేలంలో నగరం నుంచి సిరాజ్‌ స్థానం సంపాదించుకోగా.. ఈ సీజన్‌లో సందీప్‌ చోటు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోల్‌కతాలో గురువారం ఐపీఎల్‌–2020 సీజన్‌కు జరిగిన క్రికెట్‌ క్రీడాకారుల వేలంలో సందీప్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం దక్కించుకుంది. ప్రస్తుతం సందీప్‌ పంజాబ్‌లో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. తమ ప్రాంతం కుర్రాడికి ఐపీఎల్‌లో అవకాశం దక్కడంతో రాంనగర్‌లోని వైఎస్సార్‌ పార్కు సమీపంలోని సందీప్‌ నివాసం స్థానికులు, అభిమానుల కోలాహలంగా మారిపోయింది. కాగా, సందీప్‌ 2010లో తన 18 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసి తన మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. అతడి కెరీర్‌లో మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇతడు బీటెక్‌ పూర్తిచేసి స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కం ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు.